25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ప్రియురాలిని పొందాలనుకొని..ప్రాణాలు పోయేలా చేశాడు

ప్రేమకు ముఖ్యమైనవి రెండు లక్షణాలు. 
ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం. 
ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదు. 
ప్రేమ కోసం ఏ పని చేయడానికైనా, 
ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగాఉండడం. 
ఒక్క మాటలో చెప్పాలంటే...త్యాగం 

ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అప్పుడే త్యాగం అనే పదానికి అర్థం తెలుస్తుంది. ప్రియురాలు దూరమౌతుంది అని తెలిసినప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకొని తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. తనను బలవంతంగా సాధించాలనుకోకూడదు. 

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వేదించడంతో, ఏమి చేయలేని పరిస్థితిలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.  

హైదరాబాద్, రాయదుర్గం, గచ్చిబౌలి రాజీవ్ నగర్ కు చెందిన హేమలత, పోచయ్య ప్రేమించుకున్నారు. ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం హేమలత తన తల్లికి చెప్పింది. వీరి పెళ్ళికి అంగీకరించలేదు. హేమలతకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటావని బెదిరించ సాగాడు. బెదిరింపులను భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

24, ఫిబ్రవరి 2014, సోమవారం

జంతువులు మనిషిలా చేస్తుంటే... మనిషి జంతువులా మారిపోతున్నారు.

వీదిలో తిరుగుతున్న కుక్కలకు ఒక్కసారి అన్నం పెడితే మరుసటిరోజు వస్తాయి. 
అలాగే పెడుతుంటే అవి ఇంటి పరిసరాల్లోనే ఉండిపోతాయి. 
వాటికి ఒక్క పూట  అన్నం పెట్టినందుకే నమ్మకంగా ఉంటాయి. 
మనకు అపాయం ఉందంటే ఎంతకైనా తెగించి కాపాడతాయి. 
మాటలు రాని మూగజీవులు అంత విశ్వాసం చూపుతుంటే 
మాటలు వచ్చి, తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం జంతువులా ప్రవర్తిస్తున్నాడు. 

కర్ణాటక, మంగళూరు, అష్రఫ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. నగర సమీపంలోని చెంబుగుడ్డ ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో అష్రఫ్ పారిపోయాడు. పోలీసులు ఆ కామాందుడికోసం గాలిస్తున్నారు. 

అమ్మాయిలు ఇలాంటి వారి ఉచ్చులలో పడకుండా, బతుకు బజారున పడకుండా జాగ్రత్త పడండి. 

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

మోసగాడికి గుణపాఠం చెప్పేదెవరు..?

ప్రేమిస్తున్నాను అనగానే నమ్మేస్తారు.. 
జీవితాంతం నీతో నడవాలి అంటే అడుగేస్తారు... 
నువ్వు లేకుండా బతకలేను అనగానే సర్వం అర్పించేస్తారు... 
జీవితం నాశానమయ్యాక ప్రాణాలు తీసుకుంటారు. 

అమ్మాయి జీవితంలో ఓడిపోతే ఇక బతకడమే వ్యర్థం అనుకుంటారు. 
అలా పిరికివారిలా ఆలోచిస్తే నిన్ను నీవే బలైపోయావు. 
మోసం చేసిన వ్యక్తికి శిక్ష పడేదెలా...? 
అలాంటివారిని ఉరికే వదిలేస్తే రేపు ఇంకొకరి జీవితాన్ని 
ఇలాగె నాశనం చేస్తారు.  
ధైర్యం చేసి ముందడుగు వేసింటే అన్యాయాన్ని అరికట్టిన 
ఆదర్శవంతురాలివి అయ్యెదానివి. 
మోసపోకుండా ఆడపిల్లలకి గుణపాఠంగా నిలిచేదానివి.   

ఖమ్మం జిల్లా, అశ్వాపురం మండలం, చింతిర్యాలగూడెం కు చెందిన రాధిక, అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగితే వెంకటనారాయణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన రాధిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

అమ్మాయిలు నమ్మిన వారికి జీవితం అర్పిస్తారు.. 
నమ్మక ద్రోహం చేస్తే జీవితమే లేకుండా చేస్తారు.. 
అని నిరూపించే ఆత్మ ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యండి. 

22, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేమకు నిప్పంటించిన ప్రేమికుడు

పువ్వుకు తావిపై నమ్మకం... 
ఎంత వికసించినా విరగకుండా చూస్తుందని.
పక్షికి రెక్కలపై నమ్మకం... 
ఎంత ఎత్తుకు ఎగిరినా పడకుండా చూస్తాయని. 
చెట్టుకు భూమిపై నమ్మకం... 
ఎంత ఎదిగినా కూలిపోకుండా చూస్తుందని. 
ప్రియురాలికి ప్రియుడిపై నమ్మకం... 
తన జీవితాన్ని కాపాడతాడని. 
తావి,భూమి,రెక్కలు వాటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి. 
ప్రియుడు మృగాడై నమ్మకంతో పాటు ప్రియురాలినీ చంపేస్తున్నాడు. 

ప్రాణంగా ప్రేమించింది, సర్వస్వం అర్పించింది, జీవితాంతం కలసి బ్రతకాలనుకుంది, పెద్దలను ఒప్పించింది, మరో 5 రోజుల్లో పెళ్లి, ఎంత సంబరపడిందో...  మంత్రాలయం మండలం చిలకలదోణ గ్రామానికి చెందిన మార్తమ్మ. 

ప్రాణం తీసైనా వదిలించుకోవాలనుకున్నాడు. అలా బైటికి వెల్లోద్దామని పిలిచాడు, నమ్మకంగా ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు, చంపాడు. కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మార్తమ్మతోపాటు ఆమె ప్రేమను నామరూపాల్లేకుండా చేశాడు. అదే గ్రామానికి చెందిన యోహాన్. 

ఫిబ్రవరి 26 న మార్తమ్మకు,యోహాన్ కు పెళ్లి అని ముద్రించిన పత్రిక కన్నీళ్లతో తడిసిపోయింది. 

19, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యకు పరిష్కారం ప్రాణం తీసుకోవడం కాదు

ప్రేమ..
గుండెల్లో పెట్టుకొని ఆరాధించడం.  
గుండెలు మండేలా బాద పెట్టడం కాదు. 
ప్రేమిస్తుంటే..ప్రేమను పొందడం కోసం ఆరాట పడడం.  
ప్రాణం పోయేలా వేధించడం కాదు.  

సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.. ప్రాణo పోతే తిరిగి రాదు. 
ప్రేమిస్తున్నానంటూ అల్లరి చేస్తుoటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి, పెద్దల సహకారంతో ఆకతాయిల ఆట కట్టిoచాలి, స్టేషన్లో కేస్ పెట్టాలి, అలాంటివారికి బుద్దివచ్చేలా చేయాలి. పిరికిదానిలా ప్రాణాలు తీసుకొని నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ధైర్యంగా క్షణమైన ఆలొచించలేకపోయావా...?

కృష్ణ జిల్లా , రాజీవ్ నగర్ కి చెందిన ఊర్మిళ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ప్రకాష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అతడి వేదింపులు బరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినా కూడా ప్రకాష్ ఆకతాయి వేదింపులను ఆపలేదు. మనస్తాపం చెందిన యువతి డిసెంబర్ 16 న ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫిబ్రవరి 19 న మృతి చెందింది.  

కూతురి ప్రేమ..తండ్రి ప్రాణాలు తీసింది

నాన్నా.... 
ఆకలేసినప్పుడు గోరుముద్దలు తినిపించావు,  
చేయి పట్టుకొని నడకను నేర్పించావు,   
బుజాలపైన ఎక్కించుకొని ఆడించావు, 
గుండెలకు హత్తుకొని జోలపాడి నిద్రపుచ్చావు, అడిగినవన్నీ కాదనకుండా కొనిచ్చావు,  
అమ్మలా ఆదరించావు, ప్రేమించావు... 
మరెందుకు నాన్నా నా మనసును అర్థం చేసుకోలేకపోయవు..? 

కూతురిని ప్రాణప్రదంగా  పెంచుకున్న  కన్నతండ్రి.. తన ఇష్టాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు జిల్లా, యర్రగుంట్లపాడుకు చెందిన గౌతమి, రమేష్ 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని వారికి  చెప్పకుండా ఫిరంగిపురంలోని విజయదుర్గాదేవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.వీరి పెళ్లి విషయం తెలిసిన గౌతమి తండ్రి అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పద్మావతి గుండె పగిలిపోయింది. 

తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటిని కుప్ప కూల్చేసి వెళ్ళిపోతే వారి గుండెలు పగిలిపోవా..? 
ఒక్కసారి మీ ఆలోచనలను వారి ముందు పెట్టి ఉంటే ఈ రోజు మీ తండ్రి ప్రాణాలతో ఉండేవాడు.