6, ఫిబ్రవరి 2014, గురువారం

ప్రేమకు ఆనకట్ట కట్టండి... అడ్డుకట్ట వేయద్దు

నదికి ఆనకట్ట కట్టవచ్చు... అడ్డుకట్ట వేయలేం. 
ఒక వేళ వేస్తే అది అడ్డుకట్టను ముంచుతుంది. 
లేదంటే వెనుకకు తిరిగి తనను తానే ముంచుకుంటుంది... పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది. 
ఆనకట్ట కడితే... నది మన మాట వింటుంది. మనం ఎలా చెబితే అలా కదులుతుంది. 

ప్రేమికులూ  అంతే వారికి ఆనకట్ట కడితే... ఎన్నిటికో ఉపయోగ పడ తారు. 
అడ్డుకట్ట వేస్తే... పెద్దలను ఎదిరిస్తారు. అదీ కాదంటే  వారి ప్రాణాలే తీసుకుని ఏడిపిస్తారు. 
పెద్దలు ఈ విషయం తెలియక వారికి అడ్డుకట్ట వేస్తున్నారు.  అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను తమ చేతులారా చంపేసుకుంటున్నారు. 

రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడెం లో 9 వ తరగతి విద్యార్థిని, ఆరేమైసమ్మకు చెందిన  సమీప బంధువు సురేష్ ను ప్రేమించింది. ఇంట్లో విషయం తెలిసి సురేష్ తల్లి విద్యార్థిని మందలించింది. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకువచ్చిన  సురేష్ తట్టుకోలేక పోయాడు. తన ప్రియురాలు లేకుండా బతకలేను అనుకున్నాడు.  5. 2. 14న ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. 

ఖమ్మం జిల్లా  చంద్రుగొండ మండలం రేపల్లె కు చెందిన  రాము,  అదే గ్రామానికి చెందినా పుష్పలత మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి ప్రేమను కాదన్నారు. విడిపోయి బతకలేక చావే శరణ్యమనుకున్నారు. అడవిలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.   

మన పిల్లలు ప్రేమించారని  తెలియగానే... వారి మీద కేకలు వేసి వారి మనసు గాయపడేట్లు చేస్తున్నాం.  వారు  ఏదో  భయంకర తప్పు చేసినట్లు భావించి నిందిస్తున్నాం. వారిని నేరస్తులుగా చేస్తున్నాం. 

అలా  కాకుండా వారు ఎందుకు ప్రేమించారు? ఎవరిని ప్రేమించారు ? అని సావధానంగా తెలుసుకోవాలి.  ఈ వయసులో ప్రేమిస్తే కలిగే నష్టాలేంటో వివరించాలి. జీవితంలో స్థిరపడ్డాక మీరు నిర్ణయం తీసుకుంటే వచ్చే ఫలితాలపై విశ్లేషించాలి.  వారి ప్రేమకు ఆనకట్ట కట్టి వారిని సరైన మార్గంలో నడిపించాలి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి