18, డిసెంబర్ 2013, బుధవారం

ప్రేమ మంటల్లో రేవతి మనసు... శరీరం

ప్రేమ దీపం లాంటిది. 
కోరిక మంట  లాంటిది. 
యువతలోని శక్తి యుక్తులను దీపంలా మార్చి.. ప్రపంచానికి వెలుగునివ్వాల్సిన
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆ బాధ్యతను విస్మరించారు. 
వారిలోని ఆశలను కోరికలుగా మార్చి దహించడానికి  మీడియా, సినిమా, సమాజం
తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 
అందుకే నేటి సమాజంలో దీపాల్లేవ్... 
మంటలే కనిపిస్తున్నాయి. 

 తూర్పు గోదావరి జిల్లా పిటాపురంలో జరిగిన ఘటన ఇందుకు నిలువెత్తు  నిదర్శనం.  వేణుగోపాల స్వామి గుడి వీధికి చెందిన రేవతిని కత్తుల గూడెం కు చెందిన నవీన్ ప్రేమిస్తున్నానని వెంటపడే వాడు. నువ్వు లేక పోతే చచ్చిపోతానని బెదిరించేవాడు. రేవతి తండ్రి హెచ్చరించినా వెంటపడ్డం మానలేదు. దీంతో రేవతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. తల్లిదండ్రులు పెళ్లి పన్నుల్లో ఉన్నారు.  దీన్ని భరించలేని నవీన్ రేవతి ఇంటికి వెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి, పరారయ్యాడు. ప్రస్తుతం రేవతి కాకినాడ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  ఆ అమ్మాయి తల్లిదండ్రుల కన్నీళ్ళు తుడవడం ఎవరితరం కావడం లేదు.

దారుణం... అరాచకం... అన్యాయం... ఘోరం... 
నవీన్ చేసిన ఘాతుకాన్ని చెప్పడానికి ఈ పదాలు ఏవి సరిపోవు... వీటన్నికంటే క్రూరమైన పదం తెలుగులో కనిపెట్టాలి. రేవతినే కాదు ప్రేమనూ తగలపెట్టిన నవీన్ ను శిక్షించాలి.  

నవీన్ ది   ప్రేమ కాదు... కోరిక. 
అందుకే వెలుగు ఇవ్వాల్సింది... దహించింది. 
ఇంటర్ తప్పిన నవీన్ ప్రేమ పేరుతో పెడుతున్న హింసను భరించలేక 
రేవతి పదో తరగతి మధ్యలో మానేసింది. 
నవీన్ పెట్టిన మంటల్లో మనసు, శరీరం కాలిపోయి ఏడుస్తోంది. 
కనీస వయస్సు లేని, జీవితమంటే అవగాహన లేని నవీన్ మనసు ఇంత కఠినంగా మారడానికి కారణం ఎవరని ఆలోచించాల్సి ఉంది. 
 ప్రేమంటే బతుకునివ్వాలి... చావును కాదని నేటి యువతకు 
పాఠాలు నేర్పాల్సిన అవసరాన్ని పెద్దలు,
ఉపాధ్యాయులు గుర్తించాల్సిన తరుణం ఇది. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి